Tamil Nadu | కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన మాజీ సైనికుడు.
Tamil Nadu | జీవిత చరమాంకంలో తమకు తోడుగా ఉండాల్సిన పిల్లలను తమను వదిలేసి ఆస్తులు కావాలంటూ వేధిస్తుండడంతో కుమిలి పోతున్నారు. అయితే తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కుమిలిపోయి ఆగిపోలేదు. తాను కష్టపడి సంపాదించిన ఆస్తి కోసం కుమార్తెలు బెదిరించడంతో ఆవేదనకు లోనైనా ఆ తండ్రి.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేశారు.అసలు కధలోకి వెళ్తే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు విజయన్ (65) కుటుంబ విభేదాలతో బాధపడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కూతుళ్లు ఆస్తిని తమ పేరపై రాయాలంటూ ఒత్తిడి పెంచుతుండటంతో, విజయన్ కోపంతో తన రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను మే 2న రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేయడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.ఈ ఆస్తిలో 10 సెంట్ల భూమి, ఆలయం సమీపంలోని ఒక ఇల్లు ఉన్నాయి.ఈ విషయం వెలుగులోకి రాగానే ఆయన భార్య కస్తూరి, కుమార్తెలు సుబ్బులక్ష్మి, రాజలక్ష్మి ఆలయ అధికారులను కలిసి పత్రాలను తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆలయ అధికారులు 1975 హుండీ నిబంధనల ప్రకారం.. హుండీలో వేసిన వస్తువులు దేవుడి ఆస్తిగా పరిగణించబడతాయని, వాటిని తిరిగి ఇవ్వడం సాధ్యపడదని స్పష్టం చేశారు.

ఆస్తి పత్రాలు ఇప్పుడు ఆలయానికి చెందాయని, అవి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం వినియోగించబడతాయని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.ఇదిలా ఉండగా న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, విజయన్ ఆస్తికి ఏకైక యజమానిగా ఉంటే, ఈ బదిలీ చట్టబద్ధంగా పరిగణించబడకపోవచ్చని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కోర్టు ద్వారా ఆస్తిని తిరిగి పొందేందుకు అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల సమీక్షకు లోబడి తుదినిర్ణయం తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.
వైష్ణవి చైతన్య తొలి పారితోషికం ఎంతో తెలుసా..










