Tholi Ekadashi | తొలి ఏకాదశి రోజు కనుక ఇలా చేస్తే కోటీశ్వరులు అవ్వడం మాత్రం పక్క..
Tholi Ekadashi | హిందువులకు తొలి పండుగగా ప్రఖ్యాతి గాంచిన తొలి ఏకాదశి రానే వచ్చింది. జూన్ 29న హిందువులు తొలి ఏకాదశి జరుపుకోనున్నారు. అయితే ఈ ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అని పిలుస్తారు. దీనినే ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు కావున శయన ఏకాదశి అంటారు. హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి.

ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్ష వదిలేస్తారు. ఇలా చేస్తే ఎన్నో జన్మాల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.
పేలాల పండుగ
తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున పేలాల పిండి (foxtail millet flour) తినడం ఆనవాయితీగా ఉంది. ఆరోగ్యపరంగా ఇది బాగా ముఖ్యమైనది. దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. గ్రీష్మ రుతువు ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, తేమ పెరుగుతుంది. ఇలాంటి వాతావరణ మార్పుల వల్ల శరీరంలో జీర్ణక్రియ మందగించడం, జ్వరం, జలుబు వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పేలాల పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు, ఇతర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పేలాలు జీర్ణమవ్వడం సులువు కాబట్టి ఉపవాసం తరువాత కూడా సులభంగా స్వీకరించవచ్చు.

ఉపవాసం
ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని ఆధీనంలోకి తీసుకువచ్చి ఒకటిగా చేసి, దేవునికి నివేదన చేయాలి. అంటే ఉపవాస దీక్షలో ఉంటాం కాబట్టి ఆరోజు మొత్తం విష్ణునామ స్మరణ చేయాలి. నామస్మరణ చేస్తూ.. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనస్సును కలిపి ఏకోణ్ముఖంగా పనిచేసే సమయాన్ని ఏకాదశిగా చెబుతారు. దీని ద్వారా మనో నిగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో కలిగిన మనో నిగ్రహం వలన మన జీవితంలో జరిగే పరిణామాలను ఎదుర్కొనే స్వభావం మనకు అలవాటు అవుతుంది. ఉపవాసం అంటే అర్థం ఉప అంటే సమీపం, దగ్గర. విష్ణునామస్మరణ చేస్తాం కాబట్టి మనస్సు విష్ణువు దగ్గరే ఉండాలి. అవసరం లేని వస్తువులను చూడాలనిగాని, వినాలనిగాని తినాలనిగాని అనిపించదు. ఇంద్రియాలపై నిగ్రహం పెంచుకునేందుకు మంచి తిథిగా ఏకాదశిని పేర్కొంటారు.










