Pawan Kalyan | రప్పా రప్పా నరుకుతానంటే లోపలేస్తాం .. పవన్ కల్యాణ్ వార్నింగ్
Pawan Kalyan | పల్నాడు జిల్లా రెంటపాళ్లలో నిన్న జగన్ పర్యటన సందర్భంగా 88 తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజ అనే వైసీపీ కార్యకర్త వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించాడు.ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ప్రదర్శించడంపై సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. జగన్ పల్నాడు టూర్ లో రపా రపా డైలాగ్ తో కూడిన ప్లకార్డ్ కలకలం రేపింది. వైసీపీ కార్యకర్తగా భావిస్తున్న ఓ వ్యక్తి వైసీపీ 2029లో అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు.

ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో పోలీసులు ఇవాళ సదరు కార్యకర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆ తరువాత ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రపా రపా తలలు నరుకుతాం అంటూ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి పై స్పందిస్తూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో డైలాగ్ ప్లకార్డు పట్టుకున్నా తప్పేనా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అతను టీడీపీకి చెందిన వ్యక్తేనని, ఆ పార్టీ సభ్యత్వం ఉందని తెలుసుకుని.. తన పార్టీ అధినేత చంద్రబాబు తప్పుల్ని తట్టుకోలేక అతను ఇలా సొంత పార్టీ వారినే ఇలా రపా రపా నరుకుతానని చెప్తున్నాడేమో అంటూ ఛలోక్తులు విసిరారు.
Also Read : ‘కుబేర’ మూవీ రివ్యూ & రేటింగ్ ..?
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల పై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి.. అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని పేర్కొన్నారు.

అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా.. వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కల్యాణ్ సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గుర్తు చేశారు.










