సింహాచలం లో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి.. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
సింహాచలం లో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి.. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి. ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశం. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణ. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.3 లక్షల సాయం. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలిరాగా, అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూలైన్‌లో గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్యసేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.
అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు, గోడ కూలిన ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలిగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు భయాందోళనలు చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
What's Your Reaction?






