Union Bank of India: ఊహించని వివాదంలో చిక్కుకున్న యూనియన్ బ్యాంక్!

Union Bank of India: ఊహించని వివాదంలో చిక్కుకున్న యూనియన్ బ్యాంక్!

May 6, 2025 - 20:20
May 6, 2025 - 20:27
 0  365
Union Bank of India: ఊహించని వివాదంలో చిక్కుకున్న యూనియన్ బ్యాంక్!

ఊహించని వివాదంలో చిక్కుకున్న యూనియన్ బ్యాంక్! యూనియన్ బ్యాంక్ పుస్తకాల కొనుగోలుపై పెను దుమారం!

కేవీ సుబ్రమణియన్ రచించిన 'ఇండియా@100' పుస్తకం 2 లక్షల పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చిన యూనియన్ బ్యాంక్ రూ.7.25 కోట్లకు కొనుగోలు.

ప్రచురణకు ముందే 50 శాతం చెల్లింపు ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్య రీతిలో వివాదంలో చిక్కుకుంది. మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ రచించిన 'ఇండియా@100' పుస్తకాలకు యూనియన్ బ్యాంక్ భారీ ఆర్డర్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. సుమారు రూ.7.25 కోట్ల విలువైన దాదాపు 2 లక్షల కాపీల కొనుగోలుకు బ్యాంక్ ఆర్డర్ ఇచ్చినట్లు, ప్రచురణకు ముందే 50 శాతం చెల్లింపులు చేసినట్లు ఆరోపణలున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి సుబ్రమణియన్‌ను కేంద్రం అనూహ్యంగా వెనక్కి పిలిపించిన తరుణంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. గతేడాది, ఈ పుస్తకాన్ని తమ వినియోగదారులకు, కార్పొరేట్ సంస్థలకు, పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని యూనియన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం నిర్ణయించినట్లు సమాచారం. రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం కోసం, ఒక్కోటి రూ.350 చొప్పున 1,89,450 పేపర్‌బ్యాక్ కాపీలను, ఒక్కోటి రూ.597 చొప్పున 10,422 హార్డ్‌కవర్ కాపీలను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆర్డర్ చేసింది.

2024 ఆగస్టులో విడుదలైన ఈ పుస్తకం కోసం, విడుదలకు ముందే యూనియన్ బ్యాంక్ 50 శాతం మొత్తాన్ని ప్రచురణ సంస్థకు చెల్లించినట్లు 'ఎకనమిక్ టైమ్స్' తన కథనంలో పేర్కొంది. సాధారణంగా ఆంగ్ల పుస్తకాలు పదివేల కాపీలు అమ్ముడవ్వడమే కష్టం కాగా, ఏకంగా దాదాపు రెండు లక్షల కాపీలకు ఆర్డర్ ఇవ్వడం, బ్యాంకుకు చెందిన 18 జోనల్ కార్యాలయాల నుంచి తలా పదివేల కాపీల చొప్పున ఈ ఆర్డర్ వెళ్లడం పుస్తక ప్రచారం, కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు తావిస్తోంది.

2018 నుంచి 2021 వరకు సీఈఏగా పనిచేసిన సుబ్రమణియన్‌ను, 2022లో ఐఎంఎఫ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. పదవీకాలం మరో ఆరు నెలలుండగానే ఇటీవలే ఆయన్ను కేంద్రం వెనక్కి పిలిపించింది. ఈ పుస్తక వ్యవహారంలో అవకతవకలే ఆయన రీకాల్‌కు కారణమై ఉండొచ్చని ఊహాగానాలున్నాయి. సుబ్రమణియన్ తొలగింపు పూర్తిగా భారత ప్రభుత్వ నిర్ణయమని ఐఎంఎఫ్ స్పష్టం చేయగా, ఆయన స్థానంలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‌ను నియమించారు.

ప్రస్తుతం ఈ పుస్తక కొనుగోళ్ల వ్యవహారం బ్యాంకింగ్, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News