Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై మోదీ కామెంట్స్! ఉగ్రవాదాన్ని సహించేది లేదు..
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై మోదీ కామెంట్స్! ఉగ్రవాదాన్ని సహించేది లేదు..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై మోదీ కామెంట్స్! ఉగ్రవాదాన్ని సహించేది లేదు.
Operation Sindoor: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఇందులో తొలుత ఉగ్రవాద శిబిరాలపైనా, ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లపైనా మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడులతు ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను శరణు వేడటంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
ఈ మొత్తం ఎపిసోడ్ పై ప్రధాని మోడీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇవాళ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ పై చేసిన దాడి విషయంలో సైన్యానికి, శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలకు సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశంలోని ప్రతీ మహిళకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు చేసిన దాడి దేశంలో ప్రతీ ఒక్కరినీ కలచివేసిందన్నారు.
కుటుంబ సభ్యుల ముందే తమ వారిని ఉగ్రవాదులు చంపారని, ఇది దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర అన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు సవాల్ గా మారిందన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కు పీఏకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు. మన కూతుళ్లు, తల్లుల నుదుటి సిందూరం తీసేస్తే ఏం జరుగుతుందో అన్ని ఉగ్రవాద సంస్థలకు తెలిసేలా చేశామని ప్రధాని మోడీ తెలిపారు.
మన దళాలు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడి చేశాయని, భారతదేశం ఇంత విధ్వంసం సృష్టించగలదని ఉగ్రవాదులు ఊహించలేకపోయారని ప్రధాని వెల్లడించారు. దేశం ఐక్యంగా ఉన్నప్పుడు, మనం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదని, ఇది కోట్లాది మంది సెంటిమెంట్ తో కూడిన విషయం అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది న్యాయం కోసం ఒక అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ అని ప్రధాని మోడీ తెలిపారు.
మే 6వ తేదీ అర్థరాత్రి, మే 7వ తేదీ ఉదయం, ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. శత్రువులకు తగిన సమాధానం ఇచ్చినందుకు భారత సాయుధ దళాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారి శౌర్యం మన దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు అంకితం అన్నారు. భారత క్షిపణులు, డ్రోన్లు పాకిస్తాన్ లోపల దాడి చేసినప్పుడు, దాడికి గురైంది ఉగ్రవాద సంస్థలు మాత్రమే కాదని, వారి నైతికత కూడా దెబ్బతిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో భారతదేశం 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని ప్రధాని తెలిపారు. దీంంతో పాకిస్తాన్ తీవ్ర షాక్‌లో ఉందన్నారు.
తమ దాడితో పాకిస్తాన్ ఉలిక్కిపడిందని, భారతదేశంతో నిలబడటానికి బదులుగా ప్రతిదాడులు చేసిందన్నారు. పాకిస్తాన్ గురుద్వారాలు, పాఠశాలలు, పౌరుల ఇళ్లను ,సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. పాకిస్తాన్ తనను తాను పూర్తిగా బయటపెట్టుకుందని తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, కానీ భారతదేశం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసిందని మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ పై దాడుల్ని జస్ట్ వాయిదా వేశామని, ఆ దేశం భవిష్యత్తులో తీసుకునే చర్యను బట్టి తాము దాడుల్ని కొనసాగిస్తామని ప్రధాని తెలిపారు.
భారతదేశంపై దాడి జరిగినప్పుడు తాము ధీటుగా, అణిచివేతగా స్పందించామన్నారు. భారతదేశంపై ఇకపై ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే తాము దీటుగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తాము ఎలాంటి అణు బెదిరింపుల్ని సహించబోమన్నారు. తమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ సైన్యం,ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, అది ఒకరోజు వారిని లోపలి నుండే నాశనం చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే, వారు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలన్నారు. ఉగ్రవాదం,చర్చలు కలిసి సాగలేవన్నారు.
What's Your Reaction?






